: ఇదొక అద్భుతం... ఆమె పై నుంచి రైలు వెళ్లినా బతికింది... వీడియో మీరూ చూడండి!
పశ్చిమబెంగాల్ లోని పురూలియాకు చెందిన ఒక మహిళ రైలు ప్రమాదం నుంచి చాకచక్యంగా తప్పించుకుంది. ఇటీవల జరిగిన ఈ సంఘటన వివరాలు హిమానీ మాంఝీ(45) అనే మహిళ తాను నివసించే నిమ్తాంద్ ప్రాంతం నుంచి టాటా నగర్ వెళ్లేందుకని పురూలియా రైల్వేస్టేషన్ కు నడుచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా ఆమె ఉన్నట్టుండి దానిపై పడిపోయింది. అదే సమయంలో అదే ట్రాక్ పై 56 బోగీల గూడ్స్ రైలు వస్తోంది. ట్రాక్ పై పడి ఉన్న మాంఝీ కింద నుంచి పైకి లేచేలోపు రైలు ఆమెను సమీపిస్తోంది. ఇదంతా గమనించిన రైల్వే సిబ్బంది, అక్కడి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. గూడ్స్ రైలు వెళ్లిపోయే దాకా లేవ వద్దని.. ట్రాక్ మధ్యలోనే బోర్లా పడుకుని ఉండమంటూ ఆమెకు సూచించారు. ఈ సూచనను పాటించిన మాంఝీ ప్రాణాలతో బయటపడింది. ఆ రైలు వెళ్లిపోయిన అనంతరం, రైల్వే సిబ్బంది, ప్రయాణికులు ఆమెను అక్కడి నుంచి నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. మాంఝీ రైల్వే ట్రాక్ పై పడిపోవడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయని, ప్రథమ చికిత్స అనంతరం టాటానగర్ వెళ్లే రైలులో ఆమెను పంపించామని రైల్వే అధికారులు చెప్పారు.