: 400 కంపెనీలకు భారీ నష్టాలు, 7,500కు నిఫ్టీ!
సెషన్ ఆరంభంలో స్వల్ప లాభాలు కనిపించినప్పటికీ, ఆ వెంటనే వచ్చిన అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోగా, మరే దశలోనూ కోలుకోలేదు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశవాళీ ఫండ్ సంస్థలు లాభాల స్వీకరణకే మొగ్గు చూపాయి. నిఫ్టీ సూచిక అత్యంత కీలకమైన 7,550 పాయింట్ల వద్ద మద్దతు పొందడంలో విఫలమై 7,500 పాయింట్లకు పది పాయింట్ల దూరానికి చేరుకుంది. ఈ స్థాయిని దాటి కిందకు పతనమైతే, 7,350 వరకూ దిగజారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరించారు. దాదాపు 400కు పైగా కంపెనీల ఈక్విటీలు ఏడాది కనిష్ఠానికి దిగజారి ఇన్వెస్టర్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చాయి. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిణామాలు స్టాక్ మార్కెట్ కు ప్రతికూలాంశాలుగా మారాయని ట్రేడ్ పండితులు విశ్లేషించారు. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 143.01 పాయింట్లు పడిపోయి 0.58 శాతం నష్టంతో 24,682.03 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 53.55 పాయింట్లు పడిపోయి 0.71 శాతం నష్టంతో 7,510.30 పాయింట్ల వద్దకు చేరాయి. ఇక బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.94 శాతం, స్మాల్ క్యాప్ 1.03 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 14 కంపెనీలు లాభాల్లో నడిచాయి. ఎన్టీపీసీ, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనీలివర్ తదితర కంపెనీలు లాభపడగా, ఐడియా, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 96,39,248 కోట్లకు చేరింది. బీఎస్ఈలో మొత్తం 2,944 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 930 కంపెనీలు లాభాలను, 1,857 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.