: మీడియాకు మేత దొరికిందని వ్యాఖ్యానించిన షాహిద్ అఫ్రిదీ
పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి మీడియాను చూస్తేనే మండిపోతోంది. మీడియాపై పలు సందర్భాల్లో నోరు పారేసుకున్న అఫ్రిదీ ఈ మధ్య మరోసారి నోరు జారాడు. దీంతో పీసీబీ కల్పించుకుని అఫ్రిదీతో మీడియాకు క్షమాపణలు చెప్పించింది. అప్పటి నుంచి మీడియా సమావేశాలకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న అఫ్రిదీ మరోసారి వార్తల్లో నిలిచాడు. న్యూజిలాండ్ టూర్ కు వెళ్లిన పాక్ జట్టు అక్కడి ఎయిర్ పోర్టులో దిగింది. అనంతరం ఎయిర్ పోర్టులోని రెస్టారెంట్ లో భోజనం చేసేందుకు సహచరుడు షెహజాద్ తో కలసి షాహిద్ అఫ్రిదీ వెళ్లాడు. భోజనం ముగించిన అనంతరం కౌంటర్లో అమెరికన్ డాలర్లను చెల్లించాడు. దీనికి ఆ రెస్టారెంట్ యజమాని నిరాకరించాడు. న్యూజిలాండ్ కరెన్సీ చెల్లించాలని కోరాడు. దీంతో అక్కడే ఉన్న వాఖస్ నవేద్ అనే అభిమాని వారి రెస్టారెంట్ బిల్లు చెల్లించాడు. అతడికి థ్యాంక్స్ చెప్పి వారు వెళ్లిపోయారు. ఇది మీడియాకు చేరడంతో దీనిపై అఫ్రిదీని ప్రశ్నించగా, మీడియాకు మళ్లీ మేత దొరికిందని వ్యాఖ్యానించాడు. కరెన్సీ మార్చుకోవడం మర్చిపోయామని, దానికి అభిమాని స్పందించాడని అఫ్రిదీ చెప్పాడు.