: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ పోరు షురూ.. మరికాసేపట్లో తొలి వన్డే


క్రికెట్ లో మరో ఆసక్తికరమైన సిరీస్ కు మరికాసేపట్లో తెర లేవనుంది. మొత్తం 5 వన్డేలు, మూడు టీ20లతో రూపుదిద్దుకున్న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ సిరీస్ లో తొలి వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. ఆస్ట్రేలియాలోని పెర్త్ లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సర్వసన్నద్ధమయ్యాయి. మనీష్ పాండే, గురుకీరత్ సింగ్, అక్షర్ పటేల్, రిషి ధవన్, బరీందర్ శ్రాన్ తదితరులతో కూడిన యువ జట్టుతో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవాన్ని గడించిన డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్ వెల్, జార్జి బెయిలీ, షాన్ మార్ష్, జేమ్స్ ఫాల్కనర్, ఆరోన్ పించ్ లతో కూడిన పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ సమతూకంగా ఉన్న జట్టుతో ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. పెర్త్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ప్రయోగాలకు తెర లేపనుండగా, ఆదిలోనే పైచేయి సాధించాలన్న పట్టుదలతో పటిష్ట జట్టుతోనే ఆసీస్ బరిలోకి దిగుతోంది. మరో గంటలో మ్యాచ్ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News