: అమరావతిలో డబ్ల్యూటీసీ సెంటర్... రూ.800 కోట్లతో భారీ భవంతి!
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి పునాది రాయి మాత్రమే పడింది. అది మినహా ఒక్క ఇటుక రాయి కూడా అందులో చేరలేదు. అప్పుడే పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయి. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో భాగంగా నిన్న ఏపీ ప్రభుత్వంతో వివిధ పారిశ్రామికవేత్తలు కుదుర్చుకున్న 282 ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి రూ.1.90 లక్షల కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. వీటిలో ఒక్క అమరావతి పరిధిలోనే రూ.13 వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తున్నాయి. వీటిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ చంద్రబాబు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఆసక్తి నెలకొంది. అమెరికాలోని న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో అమరావతిలోనూ ఓ భారీ భవంతిని నిర్మించేందుకు ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. దాదాపు రూ.800 కోట్లతో నిర్మితం కానున్న సదరు భవంతి అమరావతికే తలమానికంగా నిలవనుందన్న భావన వ్యక్తమవుతోంది. అమరావతి నిర్మాణంతోనే డబ్ల్యూటీసీ సెంటర్ నిర్మాణం కూడా మొదలు కానుందని సమాచారం.