: దేశంలో ‘ఆటంక్ రాజ్’!...బీజేపీ ‘జంగిల్ రాజ్’ కామెంట్లపై తేజస్వీ ఫైర్
పొగడ్తకు ప్రశంస... తెగడ్తకు విమర్శ. ఇదీ ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్టైల్. ఇక ఆయన కడుపున పుట్టిన తేజస్వీ కూడా అంతేగా. ఇప్పటికే తండ్రి యాసతో పాటు ఆహార్యాన్ని కూడా వంటబట్టించుకుంటున్న బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్... పాట్నాలో నేడు మీడియాతో మాట్లాడిన సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీహార్ లో ఇటీవల వెలుగుచూస్తున్న నేరాలను సాకుగా చూపుతూ రాష్ట్రంలో ‘జంగిల్ రాజ్-2’ పాలన నడుస్తోందని విమర్శలు గుప్పించిన బీజేపీ నేతలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చోటుచేసుకుంటున్న నేరాలకు సంబంధించిన లెక్కలు తీస్తూ బీహార్ లో ‘జంగిల్ రాజ్’ పాలన సాగుతోందని మీరనుకుంటే.. అవే గణాంకాలను పరిశీలిస్తే దేశంలో ‘ఆటంక్ రాజ్’పాలన నడుస్తోందని ఆయన విమర్శించారు. ‘‘దేశ రాజధాని ఢిల్లీలో క్రైం రేట్ పరిస్థితి ఏమిటి? భద్రత పరిస్థితి ఏమిటి? అక్కడ లా అండ్ ఆర్డర్ అమలవుతోందా?’’ అని తేజస్వీ బీజేపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు.