: గడ్డం ట్రిమ్ చేయండి... పాశ్చాత్య వస్త్రాలను ధరించండి: మిలిటెంట్లకు ఐఎస్ కొత్త మాన్యువల్
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తన మిలిటెంట్లకు సరికొత్త మాన్యువల్ ను ప్రకటించింది. భీకర దాడులకు బయలుదేరే సమయంలో భద్రతా దళాల కళ్లు గప్పేందుకే కొత్త మాన్యువల్ ను ప్రవేశపెడుతున్నట్లు ఆ సంస్థ ఇన్ స్ట్రక్టర్ ముష్కరులకు ఆదేశాలు జారీ చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఈ మాన్యువల్ ను ఆ సంస్థ తన అనుయాయులకు పంపుతోంది. ఈ మాన్యువల్ లో పలు ఆసక్తికర అంశాలున్నాయి. సాధారణంగా ముస్లింలు పెద్ద గడ్డంతో ఉంటారు. అంతేకాక ఎక్కడ ఉన్నా, వారు కుర్తాలను ధరించేందుకే ఇష్టపడతారు. ఈ తరహా లుక్కుతో కనిపించే వారిని ముస్లింలని ఇట్టే చెప్పేయొచ్చు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన సదరు మాన్యువల్... గడ్డం నీట్ గా ట్రిమ్ చేసుకునేందుకు తమ మిలిటెంట్లను అనుమతించింది. నీటుగా గడ్డం చేయించుకుని వెస్టర్న్ డ్రెస్ (పాశ్చాత్య వస్త్రధారణ)లను కూడా వేసుకోండని తెలిపింది. ఆశ్చర్యకరంగా క్రైస్తవుల్లా కనిపించేలా మెడలో క్రిస్టియన్లు వేసుకునే లాకెట్ ను కూడా వాడండని కూడా తెలిపింది. పాస్ పోర్టులో ఇస్లామిక్ పేరు ఉన్న వారు మాత్రం మెడలో శిలువ వాడరాదని హెచ్చరించింది. కొత్త మాన్యువల్ ను పాటించి నిర్దేశిత లక్ష్యం మేరకు భీకర దాడులకు పాల్పడాలని 58 పేజీల్లోని ఆ మాన్యువల్ లో ఐఎస్ బాసులు సూచించారు.