: సోనియా గాంధీకి షాక్!... స్మార్ట్ సిటీ జాబితా నుంచి రాయిబరేలి ఔట్
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఈ వార్త నిజంగా షాకిచ్చేదే. ఎందుకంటే ఆమె సొంత నియోజకవర్గం రాయిబరేలీ... స్మార్ట్ సిటీల జాబితా నుంచి తొలగిపోయింది. రాయిబరేలీతో పాటు భాగ్యనగరి హైదరాబాదు, జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లు కూడా ఆ జాబితా నుంచి అదృశ్యమయ్యాయి. హైదరాబాదు కనిపించకపోవడానికి కారణం సుస్పష్టమే. తొలి విడతలో కాకుండా రెండో విడతలో ఆ నగరాన్ని చేర్చాలని సాక్షాత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాశారు. ఇక శ్రీనగర్ విషయంలోనూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ఏమరపాటే కారణంగా కనిపిస్తోంది. సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయిబరేలీ నిష్క్రమణకు మాత్రం అటు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కూడా కారణంగా కనిపిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రం నుంచి మొత్తం 13 నగరాలను స్మార్ట్ సిటీల జాబితాకు పంపాల్సి ఉంది. అయితే 12 నగరాలను ఎంపిక చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం 13వ నగరం కింద... రాయిబరేలీ (కాంగ్రెస్), మీరట్ (బీజేపీ) లలో ఏదో ఒకదానిని ఎంపిక చేయాలని కేంద్రానికి ప్రతిపాదించింది. అయితే అది తమ బాధ్యత కాదని చెప్పిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, మీరే తేల్చండని అఖిలేశ్ కేబినెట్ కు తేల్చిచెప్పింది. దీంతో అఖిలేశ్ ప్రభుత్వం రాయిబరేలీని ఎంపిక చేసి పంపగా, దీని ఎంపికకు, మీరట్ ను ఎంపిక చేయకపోవడానికి కారణం తెలపాల్సిందిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వివరణ కోరింది. ఈ విధంగా స్మార్ట్ సిటీల జాబితా నుంచి రాయిబరేలీ అదృశ్యమైపోయింది.