: ‘పఠాన్ కోట్’పై భారత్ కు పాక్ ప్రాథమిక నివేదిక...‘ఉగ్ర’ నెంబర్లు రిజిష్టర్ కాలేదని వెల్లడి
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి పాకిస్థాన్ లో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నేటి ఉదయం ఐబీ, ఐఎస్ఐ, ఎంఐ, ఎఫ్ఐఏ, స్థానిక పోలీసులతో కలిపి సంయుక్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. వెనువెంటనే రంగంలోకి దిగిపోయిన దర్యాప్తు బృందం మూడు జిల్లాల్లో ముమ్మర సోదాలు చేసింది. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో భాగంగా పదుల సంఖ్యలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వైపు కింది స్థాయి అధికారులు సోదాలు చేస్తుంటే, ఉన్నతాధికారులు సాంకేతికాంశాలపై సమీక్ష చేస్తున్నారు. అంతేకాక తాము నిర్వహిస్తున్న దర్యాప్తునకు సంబంధించి ప్రాథమిక నివేదికను కూడా రూపొందించారు. సదరు నివేదికను వారు భారత్ కు అందజేశారు. పఠాన్ కోట్ నుంచి ఉగ్రవాదులు పాక్ లోని తమ కుటుంబాలు, వారి బాసులతో మాట్లాడారని భారత్ చెబుతున్న ఫోన్ నెంబర్లు తమ దేశంలో రిజిష్టర్ కాలేదని ఆ నివేదికలో పాక్ వెల్లడించినట్లు సమాచారం. అంతేకాక తమ దేశంలో రిజిష్టర్ కాని నెంబర్లను తాము ట్రేస్ చేసే అవకాశాలు కూడా లేవని తెలిపినట్లు సమాచారం.