: చావుకి సిద్ధమంటున్న భారత సంతతి ఐఎస్ ఉగ్రవాది సిద్ధార్థ్
చావుకి సిద్ధంగా ఉన్నానని భారత సంతతి ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సిద్ధార్థ్ ధర్ స్పష్టం చేశాడని అతని సోదరి కనిక తెలిపారు. బ్రిటన్ లో స్థిరపడిన సిద్ధార్థ్ ధర్ ఇస్లాం మతం స్వీకరించిన సంగతి తెలిసింది. తరువాత మత ఛాందసవాదంతో బ్రిటన్ పోలీసులకు చిక్కి, విచారణ ఎదుర్కొంటూ సిరియా పరారై, ఐఎస్ఐఎస్ లో చేరి కొత్త జీహాదీ జాన్ గా మారాడు. ఈ నేపధ్యంలో అతని సోదరి కనిక మాట్లాడుతూ, గత అక్టోబర్ లో సిద్ధార్థ్ తనకు ఫోన్ చేశాడని తెలిపారు. ఆ సందర్భంగా ఐఎస్ నుంచి బయటికి రావాలని, లేని పక్షంలో తీవ్రపరిణామాలు చవిచూడాలని ఆమె సూచించగా, తాను చావుకు సిద్ధమని సిద్ధార్థ్ సమాధానం ఇచ్చినట్టు ఆమె తెలిపారు. ఐఎస్ లో చేరిన తొలినాళ్లలో తిరిగి ఇంటికి రావాలని కోరితే వస్తే అరెస్టు చేస్తారని తెలిపాడని ఆమె వివరించారు. సిద్ధార్థ్ సిరియా వెళ్లిన తరువాత అతనిని గూఢచారిగా నియమించుకునేందుకు బ్రిటన్ నిఘా విభాగం తీవ్రంగా యత్నించినట్టు తెలుస్తోంది.