: అందాల భామల ఎఫెక్ట్... సైన్యానికి 'నెట్' కోత!
ఇటీవలి కాలంలో సైనికాధికారులను లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాద సంస్థలు, ఇంటర్నెట్ మాధ్యమంగా అందమైన అమ్మాయిలను ఎరవేసి, రహస్యాలను సేకరిస్తున్న ఘటనలు పెరగడంతో రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా, సైన్యంలో పనిచేస్తున్న వారి ఇంటర్నెట్ వాడకంపై నిబంధనలు విధించింది. వైఫై, బ్లూటూత్ ఆధారిత పరికరాలు వాడరాదని, ముఖ్యంగా సౌత్ బ్లాక్ లో పనిచేస్తున్న వారంతా దీన్ని పాటించాలని ఆదేశించింది. రక్షణ శాఖకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫైళ్లు అందరూ సులువుగా చేరుకునేలా ఇంటర్నెట్ లో ఉండటాన్ని గమనించిన ఉన్నతాధికారులు, అంతర్గత సైబర్ భద్రతపైనా కొన్ని సూచనలు చేశారు. రక్షణ శాఖ కంప్యూటర్లు సులువుగా హ్యాకింగ్ చేసేలా ఉన్నాయని భావించిన అధికారులు, భద్రతను మరింత పెంచాలని ఆదేశించారు. డిఫెన్స్ మినిస్ట్రీ అధికారులు సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండా కార్యాలయంలో నెట్ వాడటాన్ని నిషేధించారు. ఈ నిర్ణయాలు తక్షణం అమల్లోకి వచ్చినట్టని రక్షణ శాఖ ఓ నోట్ ఫైల్ లో వెల్లడించింది.