: సోనియా మంతనాలతో వేడెక్కిన కాశ్మీరం... కమలనాథుల్లో గుబులు!


జమ్మూకాశ్మీర్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీతో విడివిడిగా సమావేశం కావడం కొత్త చర్చను తెరపైకి తెచ్చింది. పైకి మాత్రం ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతికి సంతాపం తెలిపేందుకు మాత్రమే వీరు మహబూబాను కలిశారని చెబుతున్నా, కాంగ్రెస్ అధినేత్రి కలయిక మాత్రం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. గత శుక్రవారం నుంచి కాశ్మీర్ రాష్ట్రం గవర్నర్ పాలన కిందకు వెళ్లగా, వాస్తవానికి నేడు మహబూబా రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వుంది. తండ్రి మరణం తరువాత ప్రకటించిన నాలుగు రోజుల సంతాప దినాలు ముగిసేవరకూ, తాను ప్రమాణ స్వీకారం చేయబోనని ఆమె స్పష్టం చేయడంతో, వచ్చే వారంలోనే ఆమె బాధ్యతలు చేపట్టవచ్చని తెలుస్తోంది. కాశ్మీర్ లో 2002 నుంచి 2008 మధ్య పీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆపై గత ఎన్నికల అనంతరం బీజేపీ, పీడీపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక తాను సీఎంగా ఉండాలంటే బీజేపీ కొన్ని షరతులు పాటించాలని ముఫ్తీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చే సమస్యే లేదని ఆమె తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సోనియా ఆమెను కలవడంతో, బీజేపీని వీడి, కాంగ్రెస్ తో జతకట్టేందుకు పీడీపీ నేత ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా పరిస్థితులు బీజేపీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

  • Loading...

More Telugu News