: కూతురుపై 20 ఏళ్ల పాటు అత్యాచారం ... ఏడుగురు చిన్నారులకు తల్లయ్యింది
తన కుమార్తెపైనే సుమారు 20 ఏళ్లపాటు అత్యచారం సాగించి, ఆమెను ఏడుగురు పిల్లలకు తల్లిని చేసిన నీచపు తండ్రి ఉదంతం అర్జెంటీనాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులకు బాధితురాలు వెల్లడించిన విషయాలు విస్తుపోయేలా ఉన్నాయి. బాధితురాలు తన ఏడుగురు చిన్నారులలో ఒకరికి ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో వైద్యుని వద్దకు తీసుకువెళ్లింది. అతను చిన్నారికి తండ్రి ఎవరని ప్రశ్నించగా, తన తండ్రే ఈ చిన్నారికి కూడా తండ్రని చెప్పడంతో వైద్యుడు కంగుతిన్నాడు. 31 సంవత్సరాల ఈ బాధితురాలిని ఆమె తండ్రి బలవంతంగా నిర్బంధించి రెండు దశాబ్దాలుగా అత్యాచారం సాగిస్తూ వచ్చాడు. తనకు పుట్టిన ఏడుగురు చిన్నారులు తన తండ్రి కారణంగానే జన్మించారని ఆమె చెప్పింది. అయితే తన తల్లి చనిపోయిన తరువాత నుంచి తండ్రి ఈ విధంగా ప్రవర్తిస్తూ వచ్చాడని పేర్కొంది. తండ్రి బారిన తొలిసారి పడినపుడు తన వయసు 9 సంవత్సరాలని తెలిపింది. కాగా వైద్యుడు పోలీసులకు ఈ విషయాన్ని చేరవేయడంతో పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు.