: ‘ఆర్మీ మార్చ్’ నిజమేనన్న తివారీపై... ఇంటా, బయటా విమర్శల వెల్లువ
యూపీఏ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సైనిక పటాలం ఢిల్లీకి బయలుదేరిందన్న మీడియా కథనాలు వాస్తవమేనన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీకి బయటి నుంచే కాక ఇంటిలోనూ విమర్శలు తప్పలేదు. నిన్న ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన మనీశ్ తివారీ... 2012లో అప్పటి ఆర్మీ చీఫ్ వీకే సింగ్ ఆదేశాలతో ప్రభుత్వంపై దండయాత్రకు సైనిక బలగాలు బయలుదేరాయన్న మీడియా కథనాలు నిజమేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వేగంగా స్పందించిన నాటి ఆర్మీ చీఫ్, నేటి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉద్యోగం లేని’ తివారీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక తివారీ వ్యాఖ్యలతో తమ పార్టీకేమీ సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు పీసీ చాకో, అభిషేక్ మను సింఘ్వీలు.. సదరు మీడియా కథనాలను కొట్టిపారేశారు.