: రైసినా హిల్స్ కు ఆర్మీ మార్చ్ నిజమే!...కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ సంచలన వ్యాఖ్య
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయడం దాయాదీ దేశం పాకిస్థాన్ లో షరా మామూలే. అలా ఆర్మీ చీఫ్ నుంచి దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టిన నేతలు ఆ దేశంలో ఉన్నారు. జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ అలా అధ్యక్ష పదవి చేపట్టిన వారే. ఈ తరహా తిరుగుబాటు భారత్ లో దాదాపు సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలు ఇక్కడ పరిఢవిల్లుతున్నాయి. అయితే 2012లో నాటి యూపీఏ సర్కారుపై సైన్యం తిరుగుబాటు యత్నం చేసిందని గతంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ సంచలన కథనం రాసిన సంగతి తెలిసిందే. హిసార్ నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని పాలనా కేంద్రం రైసినా హిల్స్ ను ముట్టడించేందుకు నాటి ఆర్మీ చీఫ్, ప్రస్తుత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వీకే సింగ్ ఆదేశాలతోనే సైనిక పటాలాలు బయలుదేరాయని ఆ కథనం పేర్కొంది. దేశంలో పెద్ద చర్చకే తెర లేపిన సదరు వార్త దాదాపుగా కనుమరుగైపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ దేశ ప్రజలకు ఆ కథనాన్ని మళ్లీ గుర్తు చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్న సందర్భంగా మనీశ్ తివారీ ఈ కథనాన్ని ప్రస్తావించారు. నాడు రైసినా హిల్స్ దిశగా సైనిక పటాలాలు బయలుదేరాయన్న వార్తలు నిజమేనని ఆయన పేర్కొన్నారు. రక్షణ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యుడిగా ఉన్న తనకు నాడు ఈ విషయంపై పక్కా సమాచారం అందిందని కూడా ఆయన పేర్కొన్నారు.