: కాంగ్రెస్ ఏకలవ్యుడు!...సోనియాకు బెయిల్ వచ్చిందని వెంకన్నకు బొటనవేలిని సమర్పించిన గ్రానైట్ వ్యాపారి
మహాభారతంలో ద్రోణాచార్యుడు కోరిన వెంటనే ముందూ వెనుకా చూసుకోకుండా బొటనవేలిని గురు దక్షిణగా సమర్పించిన ఏకలవ్యుడు అస్త్ర సన్యాసం చేశాడు. అదెప్పుడో పురాణ కాలంలో జరిగిన ఘటన. మరి కలియుగంలోనూ ఆ తరహా ఘటన జరిగితే?... జరిగితే కాదు, తిరుమల వెంకన్న సాక్షిగా ఈ ఘటన చోటుచేసుకుంది. గత నెల 25న జరిగిన ఈ ఘటన కాస్తంత ఆలస్యంగా రెండు రోజుల క్రితం వెలుగుచూసింది. ఈ ఘటన నేపథ్యం కాస్తంత వేరైనప్పటికీ, కలియుగ ఏకలవ్యుడిగా జాతీయ మీడియా పతాక శీర్షికలకు ఎక్కుతున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. అతడే కర్ణాటకలోని రామనగరానికి చెందిన ఉడువాలు సురేశ్. 35 ఏళ్ల సురేశ్ కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటుగానే ఉంటూ గ్రానైట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నా సురేశ్ కు వల్లమాలిన అభిమానం. మొత్తంగా గాంధీ కుటుంబానికే అతడు వీరాభిమాని. తాను అత్యంత అభిమానించే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నేషనల్ హెరాల్డ్ కేసులో అరెస్ట్ దాకా వెళ్లడంతో సురేశ్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తమ నేతలను అరెస్ట్ ముప్పు నుంచి తప్పించి, బెయిల్ ఇప్పిస్తే బొటన వేలిని సమర్పించుకుంటానని తిరుమల వెంకన్నకు మొక్కుకున్నాడు. గత నెలలో కోర్టుకు వెళ్లిన సోనియా, రాహుల్ గాంధీలు క్షణాల్లో బెయిల్ పై బయటకు వచ్చారు. అంతే, వెంకన్న మొక్కును గుర్తు చేసుకున్న సురేశ్ ఇంటిలో ఎవరికీ చెప్పా పెట్టకుండా తిరుమలకు చెక్కేశాడు. బొటన వేలిని కట్ చేసి, దానిని రూ.1000 కరెన్సీ నోటులో చుట్టేసి వెంకన్న హుండీలో వేశాడు. బయటకు వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఏదో ప్రమాదంలో వేలు తెగిందని నమ్మబలికి కట్టు కట్టించుకుని ఇంటికెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇటీవల కర్ణాటకలో తన అభిమాన సినీ నటుడు, రాజకీయ నేత అంబరీష్ ను సురేశ్ కలుసుకున్నాడు. వేలికున్న కట్టును చూసి అంబరీష్ విషయమేంటనే ఆరా తీయగా, జరిగిందంతా చెప్పేశాడు. షాక్ తిన్న అంబరీష్... సురేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా, తన అభిమాన నేతలకు బెయిల్ వచ్చినందుకు తాను చేయాలనుకున్నది చేశానని అంబరీష్ కు సురేశ్ చెప్పేశాడు. సురేశ్ కు పార్టీపై ఉన్న అభిమానానికి ఫిదా అయిపోయిన అంబరీష్... సురేశ్ ను కలియుగ ఏకలవ్యుడిగా అభివర్ణించాడు. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయవద్దని వేడుకుని అతడిని మరీ పంపారు. త్వరలో సురేశ్ ఇంటికి వెళ్లనున్న అంబరీష్ అతడికి పార్టీ తరఫున సంఘీభావం తెలపనున్నారట.