: వరుసగా తొమ్మిదో సారి!... ఆర్జేడీ చీఫ్ గా లాలూ ఏకగ్రీవ ఎన్నిక
1997లో భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి తలెత్తిన అభిప్రాయ భేదాలతో జనతా దళ్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ బయటకొచ్చేశారు. అదే ఏడాది జూలై 5న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పేరిట కొత్త పార్టీని ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పటిదాకా ఏకంగా 8 సార్లు పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చిన ఆయన, నిన్న వరుసగా తొమ్మిదో సారి కూడా పార్టీ చీఫ్ గా యునానిమస్ గానే ఎన్నికయ్యారు. ఈ నెల 17న లాంఛనంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న లాలూ యాదవ్ 2019 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. పార్టీ అధ్యక్ష పదవికి శుక్రవారంతో ముగిసిన నామినేషన్ల గడువులోగా లాలూ ఒక్కరిదే నామినేషన్ దాఖలైంది. పార్టీలోని నేతలెవ్వరూ ఆ పదవి కోసం నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఆర్జేడీ అధ్యక్షుడిగా వరుసగా తొమ్మిదో సారి లాలూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పార్టీ జాతీయ ఎన్నికల అధికారి జగదానంద సింగ్ నిన్న ప్రకటించారు.