: ఐఏఎస్ కంటే... అతడికి ఈ-ట్యూటర్ పోస్టే నచ్చేసింది!
నిజమేనండోయ్... రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన 24 ఏళ్ల రోమన్ సైనీ ఉన్నత శిఖరాలకు చేర్చే ఐఏఎస్ పదవికి ముందూ వెనుకా చూడకుండా రాజీనామా చేసేశాడు. అప్పటికే దేశంలోని ప్రతిష్ఠాత్మక మెడికల్ కళాశాల అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో వైద్య విద్యను పూర్తి చేసిన రోమన్ సైనీ, వెనువెంటనే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి సత్తా చాటాడు. దేశంలోనే అత్యున్నత సర్వీసు ఐఏఎస్ కు ఎంపికై, శిక్షణను దిగ్విజయంగా పూర్తి చేశాడు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాకు అసిస్టెంట్ కలెక్టర్ గానూ పదవీ బాధ్యతలు చేపట్టాడు. ఇంకేముంది, రిటైరయ్యేనాటికి సైనీ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టును అధిరోహించడమే కాక కేంద్ర సర్వీసుల్లోనూ కీలక పోస్టుల్లోనూ పనిచేసే అవకాశముంది. అయితే ఇవేవీ అతడికి సంతృప్తి ఇవ్వలేకపోయాయి. ఉన్నపళంగా జబల్ పూర్ అసిస్టెంట్ కలెక్టర్ పోస్టుకు రాజీనామా చేసేశాడు. ఐఏఎస్ హోదానూ వదిలేసుకున్నాడు. తన మిత్రుడి సలహాతో అప్పటికే నడుపుతున్న ‘అనాకడమీ.ఇన్ (unacademy.in)’ను మరింత విస్తరించేందుకు నడుం బిగించాడు. ఆన్ లైన్ లో ట్యూషన్లు చెప్పే ఈ వెబ్ సైట్ ను అతడే స్థాపించాడు. ఐఏఎస్ కు ఎంపికైన నేపథ్యంలో దానిని ఇతరులకు విక్రయించాలని భావించినా, ఒక్కసారిగా తన మనసు మార్చుకున్నాడు. తన చేతుల్లో పురుడుపోసుకున్న ‘అనాకడమీ.ఇన్’కి అధిపతిగా ఉండేందుకే అతడు నిశ్చయించుకున్నాడు. ఇంతకీ, అసలు ఈ అనాకడమీ.ఇన్ లో ఏముంటుందంటే... పలు పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులను ఆయా పరీక్షలకు సర్వ సన్నద్ధం చేస్తుందట. ఇప్పటికే ఈ సైట్ లోని సైనీ వీడియో పాఠాలతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించారు. దీంతో దీనిని దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగార్థుల దరి చేర్చడమే లక్ష్యంగా సైనీ బంగారం లాంటి కలెక్టర్ పోస్టును వదిలేసుకున్నాడు.