: దేశంలోనే ఆదర్శ ఎమ్మెల్యేగా టీడీపీ నేత!... అభినందించిన చంద్రబాబు, లోకేశ్
దేశంలోనే ఆదర్శ ఎమ్మెల్యేగా ఏపీకి చెందిన టీడీపీ నేత శివరామరాజు ఎంపికయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన శివరామరాజు నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని దాదాపు 3 వేల మందికి పైగా ఉన్న ఎమ్మెల్యేల పనితీరును పరిశీలించిన పూణేలోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్... ఏటా తాను ప్రకటించే ‘ఆదర్శ యువ విధాయక్’ అవార్డుకు శివరామరాజును ఎంపిక చేసింది. అవార్డుకు ఎంపికైన విషయాన్ని ఆ సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఈ నెల 27న ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆ సంస్థ ఈ అవార్డును శివరామరాజుకు అందజేయనుంది. రెండు రోజుల క్రితం ఉభయగోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు అవార్డు వచ్చిన విషయాన్ని శివరామరాజు చెప్పారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు నియోజకవర్గ అభివృద్ధిలో మరింత మేర సత్ఫలితాలు రాబట్టాలని ఆయనకు సూచించారు. నిధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా శివరామరాజును ప్రత్యేకంగా అభినందించారు.