: మోదీకి 'రొంబ' థ్యాంక్స్!... జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు 'అమ్మ' కృతజ్ఞత
పొంగల్ సందర్భంగా తమిళనాడు సహా ఆ రాష్ట్ర సరిహద్దులోని ఏపీ జిల్లా చిత్తూరు వ్యాప్తంగా కోలాహలంగా జరిగే జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిన్న కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జంతు ప్రేమికుల అభ్యంతరాలను పక్కనబెట్టిన నరేంద్ర మోదీ సర్కారు సంప్రదాయానికే ఓటేసింది. అంతేకాక ఈ విషయంపై అందిన వినతుల పరిశీలనను సుదీర్ఘ కాలం పెండింగ్ లో పెట్టకుండా ఒక్క నిమిషంలో తేల్చేసింది. కేంద్రం తక్షణ స్పందనకు అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఫిదా అయిపోయారు. వెంటనే ప్రధానికి రొంబ (చాలా) థ్యాంక్స్ చెప్పారు. నిన్న కేంద్రం నుంచి జల్లికట్టుకు అనుమతి లభిస్తూ ఉత్తర్వులు వెలువడగానే, జయలలిత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నాన్చుడు ధోరణిలో కాకుండా తక్షణం స్పందించారని ఆమె ప్రధానికి థ్యాంక్స్ చెప్పారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాలను పరిరక్షించుకోవాలన్న తమ భావనకు మద్దతిచ్చారని కూడా ఆమె మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. పనిలో పనిగా ఈ విషయంలో కేంద్రం నుంచి తక్షణ స్పందన వచ్చేలా వ్యవహరించిన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కృషిని కూడా జయలలిత ఆ లేఖలో ప్రస్తావించారు.