: అమ్మాయిలూ... ఫ్యాషన్ యావ వీడండి!: కాలేజీ గర్ల్స్ కు కర్ణాటక గవర్నర్ సూచన
కర్ణాటక గవర్నర్ వాజూభాయి వాలా నిన్న కాలేజీ గర్ల్స్ కు షాకిచ్చారు. మహిళా సంఘాల నుంచి విమర్శలూ ఎదుర్కొన్నారు. అయినా ఆయన ఏం చేశారనేగా మీ అనుమానం. కర్ణాటకలోని మైసూరు వేదికగా జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిన్న ముగిసింది. ముగింపు సమావేశానికి హాజరైన వాజూభాయి తనదైన రీతిలో ప్రసంగంతో దూసుకెళ్లారు. సైన్స్ కాంగ్రెస్ వేదికగా ఆయన చేసిన ప్రసంగాన్ని కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు చప్పట్లతో స్వాగతం పలకగా, సైంటిస్ట్ లు మాత్రం నొసలు చిట్లించారు. అయినా వాజూభాయ్ ప్రస్తావించిన అంశమేంటంటే... కాలేజీ గర్ల్స్ కు చెందిన ఫ్యాషన్ యావ. ‘అమ్మాయిలూ... ఫ్యాషన్ యావ వీడండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. తనదైన శైలిలో సెటైరికల్ యాసలో వాజూభాయ్ చేసిన ప్రసంగానికి కార్యక్రమానికి హాజరైన కాలేజీ గర్ల్స్ కూడా చప్పట్లతో స్వాగతం పలికారు. ‘‘కాలేజీ అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా తేలివైన వారే. జీవితంలో సాధించాలనుకున్న దాని కోసం కొన్నింటిని త్యాగం చేయాలి. అబ్బాయిలు దుర్వ్యసనాలను వీడాలి. అమ్మాయిలు ఫ్యాషన్ యావ నుంచి బయటపడాలి. అమ్మాయిలు... మీరు కాలేజీకి వస్తోంది చదువుకోవడానికే కాని ఫ్యాషన్ వీక్ లో పాల్గొనేందుకు కాదు. మీరు కనుబొమలను తీర్చిదిద్దుకోవడం, లిప్ స్టిక్ పూసుకోవడం, కురులను ట్రిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు’’ అంటూ వాజూభాయ్ పేర్కొన్నారు. అయితే చదువుకు, ఫ్యాషన్ కు సంబంధమేంటని అక్కడున్న సైంటిస్ట్ లు ఒకింత అసహనానికి గురైతే, మహిళా సంఘాలు మాత్రం వాజూభాయ్ వ్యాఖ్యలపై మండిపడ్డాయి.