: ఆమిర్, షారూఖ్ లకు షాక్... భద్రతను కుదిస్తూ ముంబై పోలీసుల నిర్ణయం
‘నా భార్య దేశం వదిలి వెళదామంది’ అంటూ వ్యాఖ్యానించి బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ పెద్ద చర్చకే తెర తీశాడు. తదనంతర పరిణామాల్లో అతడు పలు విపరిణామాలను ఎదుర్కొంటున్నాడు. సుదీర్ఘ కాలంగా ‘ఇంక్రెడిబుల్ ఇండియా’కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన అతడికి కేంద్ర పర్యాటక శాఖ నిన్న షాకిచ్చింది. బ్రాండ్ అంబాసిడర్ గా ఇకపై ఆమిర్ ను తీసుకోవడం లేదని ప్రకటించింది. తాజాగా నేడు అతడికి కల్పిస్తున్న భద్రతను కుదిస్తూ ముంబై పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమిర్ తో పాటు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ సెక్యూరిటీని కూడా తగ్గిస్తున్నట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో పాటు 40 మంది బాలీవుడ్ నటులకు కల్పిస్తున్న భద్రతను కుదించక తప్పడం లేదని కూడా ముంబై పోలీసులు పేర్కొన్నారు. సెలెబ్రిటీలకు ముంబై పోలీసులు స్థాయికి మించి భద్రతను కల్పిస్తున్నారని, దీంతో ప్రభుత్వంపై పెను భారం పడుతోందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన వార్షిక నివేదికలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నివేదికతో వాస్తవ పరిస్థితులపై సమీక్ష చేసిన ముంబై పోలీసులు బాలీవుడ్ నటులకు అవసరమైన మేరకు మాత్రమే భద్రతను కల్పించాలని భావించినట్లు తెలుస్తోంది. ఆమిర్ సహా షారూఖ్ ఖాన్, ఇతర బాలీవుడ్ నటులకు భద్రతను తగ్గించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, దీనిని త్వరలోనే అమలు చేయనున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.