: ఆరు బుల్లెట్లు దిగినా వెన్నుచూపని వీరుడు!... బెంబేలెత్తిన టెర్రరిస్టులు
భారత్ కు పెను నష్టాన్ని మిగిల్చే క్రమంలో ప్రాణాలు సైతం వదిలేందుకు సిద్ధపడి వచ్చిన ఉగ్రవాదులు... పఠాన్ కోట్ భద్రతా విధుల్లో ఉన్న ఓ సైనికుడిని చూసి బెంబేలెత్తిపోయారు. సదరు సైనికుడి వీరత్వాన్ని చూసి బిక్కచచ్చిపోయిన ఉగ్రవాదులు కాల్పులు విరమించి పరుగులు పెట్టారు. అయినా వారిని ఆ సైనికుడు వెంటాడాడు. ఆయనే 24 ఏళ్ల శైలేశ్ గౌర్. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ భద్రతను గరుడ కమెండోలు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 2న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కమెండోలు షిఫ్ట్ మారుతున్న సమయం చూసి ఆరుగురు ముష్కరులు మెరుపు దాడి చేశారు. అయితే క్షణాల్లో అప్రమత్తమైన 12 మంది గరుడ కమెండోలు ఉగ్రవాదులను నిలువరించేందుకు రంగంలోకి దిగారు. క్షణాల్లో వ్యూహాన్ని రచించుకున్న కమెండోలు ఇద్దరిద్దరుగా ఆరు బృందాలుగా విడిపోయారు. ఉగ్రవాదులను ముందు నుంచి మూడు బృందాలు నిలువరిస్తుంటే, మరో మూడు బృందాలు వెనుక నుంచి కౌంటర్ అటాక్ ప్రారంభించాయి. ముష్కరుల నిలువరింపు బాధ్యతలు తీసుకున్న బృందాల్లోని వింగ్ కమాండర్ గురుసేవక్ సింగ్ తొలుత ఉగ్రవాదులపై అటాక్ కు శ్రీకారం చుట్టారు. ఆయన వెంట శైలేశ్ గౌర్, కేతల్ అనే ఇద్దరు కమెండోలు ఉగ్రవాదులపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో గురుసేవక్ సింగ్ శరీరంలోకి 3 బుల్లెట్లు చొచ్చుకువెళ్లాయి. అయినా ఆయన ఏమాత్రం వెన్ను చూపలేదు. ఉగ్రవాదులతో పోరు సాగిస్తూనే ఆయన నేలకొరిగారు. అదే సమయంలో ఉగ్రవాదుల తుపాకుల నుంచి దూసుకువచ్చిన ఆరు బుల్లెట్లు శైలేశ్ పొత్తి కడుపులోకి చొచ్చుకువెళ్లాయి. అయినా, ఏమాత్రం లెక్కచేయని శైలేశ్, కేతల్ తో కలిసి ఉగ్రవాదులను నిలువరించారు. శరీరంలో ఆరు బుల్లెట్లు దిగినా ఆయన ఏకంగా గంటకు పైగా ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. రక్తం కారుతున్నా లెక్క చేయకుండా శైలేశ్ చేస్తున్న పోరాటాన్ని చూసి ఉగ్రవాదులు బిత్తరపోయారు. ఇంకా అక్కడే ఉంటే, శైలేశ్ తుపాకీ గుళ్లకు బలి కావాల్సి వస్తుందేమోనన్న భయంతో వారు ముందడుగు వేసే సాహసం చేయలేక వెనక్కు పరుగులు పెట్టారు. శైలేశ్ ఏమాత్రం విశ్రమించినా, ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లోని కీలక స్థావరం మెకానికల్ ట్రాన్స్ పోర్టు ఏరియాలోకి ప్రవేశించేవారే. అదే జరిగి ఉంటే, భారత్ కు పెను నష్టమే వాటిల్లేది. ఉగ్రవాదులను తరిమికొట్టి, తీవ్ర గాయాలతో కుప్పకూలిన శైలేశ్ ను ఆయన సహచరులు మూడు గంటల తర్వాత కాని ఎయిర్ బేస్ బయట ఉన్న ఆసుపత్రికి తరలించలేకపోయారు. దీంతో తీవ్ర రక్తస్రావంతో శైలేశ్ మృత్యువు సమీపానికి వెళ్లారు. ఆసుపత్రిలో చేర్చగానే తిరిగి కాస్తంత కోలుకున్న ఆయనకు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ముష్కరులను పరుగులు పెట్టించిన శైలేశ్ మృత్యువును కూడా జయించాలని మనమంతా ప్రార్థిద్దాం.