: బెజవాడలో హైటెన్షన్... ‘మల్లాది’ అరెస్ట్ నేపథ్యంలో నగరంలో 144 సెక్షన్
నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నగరంలోని కృష్ణలంకకు చెందిన స్వర్ణ బార్ లో వెలుగుచూసిన కల్తీ మద్యం ఘటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆయన సోదరుడు మల్లాది శ్రీనివాస్ లను నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ పేరిట రెండు రోజుల పాటు సిట్ పోలీసులు విష్ణును దాదాపు 25 గంటల పాటు విచారించారు. సిట్ అధికారుల ముందు విచారణకు హాజరైతే, అరెస్ట్ ఉండదన్న కోర్టు వ్యాఖ్యలతో నాలుగు రోజుల క్రితం తన నెల రోజుల అజ్ఞాతవాసాన్ని విష్ణు వీడారు. మొన్న, నిన్న ఆయన సిట్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే, అరెస్ట్ ఉండబోదని భావించిన వారికి షాకిస్తూ నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మల్లాది సోదరులను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మాస్ లీడర్ గా పేరున్న మల్లాది విష్ణు అరెస్ట్ తో నిన్న రాత్రే నగరంలో కలకలం రేగింది. మల్లాది అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాక నేటి ఉదయం మల్లాది సోదరులను కోర్టుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల కింద పోలీసులు నగరవ్యాప్తంగా 144 సెక్షన్ ఆంక్షలను విధించారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించారు. దీంతో ప్రస్తుతం నగరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.