: పింక్ సిటీగా భాగ్యనగరి!...‘గులాబీ’ హోర్డింగులపై జాతీయ మీడియాలో ఆసక్తికర కథనాలు
దేశంలో పింక్ సిటీ ఏదంటే?... జైపూర్ అని ఠక్కున సమాధానం వచ్చేస్తుంది. అయితే పింక్ సిటీకి పోటీగా భాగ్యనగరి పరుగులు పెడుతోందట. అదేదో... అభివృద్ధిలోనో, లేక పారిశుద్ధ్యంలోనో కాదులెండి. కేవలం ‘కలర్’ లో మాత్రమే. అది కూడా ‘గులాబీ’ కలరేనట! ఈ మేరకు జాతీయ మీడియాలో మొన్న, నిన్న పలు ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి. అసలు విషయమేంటంటే... నాలుగైదు రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ఎక్కడ చూసినా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ గులాబీ జెండాలు, హోర్డింగులే కనిపిస్తున్నాయి. జంట నగరాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. నగర ప్రధాన కూడళ్లలో కళ్లు తిప్పుకోలేని విధంగా వివిధ వాణిజ్య ప్రకటనలు దర్శనమిచ్చేవి. అయితే ప్రస్తుతం వాటి స్థానంలో ‘గులాబీ’ పార్టీకి చెందిన వర్ణంతో కూడిన హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. ఒక్క హోర్డింగులేమిటి... నగరంలోని ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు దిమ్మెలన్నీ కూడా గులాబీమయం అయిపోయాయి. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యమే భాగ్యనగరి గులాబీ మయానికి కారణమని కూడా నేషనల్ మీడియా కథనాలు చెబుతున్నాయి. గడచిన ఎన్నికల్లో కొత్త రాష్ట్రం తెలంగాణలో సత్తా చాటిన టీఆర్ఎస్, గ్రేటర్ పరిధిలో మాత్రం చతికిలబడింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం నగర ప్రజలకు ఇప్పటికే పెద్ద ఎత్తున తాయిలాలను ప్రకటిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రకటనలు, నగరంలో వెలసిన హోర్డింగ్ లలో ఆ తాయిలాల ప్రచారాన్ని కూడా సదరు మీడియా కథనాలు కళ్లకు కట్టాయి. ఇక తమకు అధికారం ఇస్తే జరిగే అభివృద్ధి, ఇతర పార్టీలకు ఓటేస్తే జరిగే నష్టానికి సంబంధించిన అంశాలు కూడా ఆ హోర్డింగులపైకి ఎక్కాయని కూడా ఆ కథనాలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించాయి. నగరంలో ఏ పార్టీకి ఎంతమేర పట్టుంది? పట్టు నిలుపుకునేందుకు ఆయా పార్టీలు పన్నుతున్న వ్యూహాలు, పార్టీల మధ్య పొత్తులు, భవిష్యత్తు రాజకీయాలను ప్రస్తావిస్తూ సాగిన ఆ కథనాలు దేశవ్యాప్తంగా పాఠకులకు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.