: వైసీపీలో ‘జంపింగ్’ల కలకలం... రంగంలోకి జగన్, కర్నూలు ఎమ్మెల్యేలకు ఫోన్


ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీలో మొన్న రాత్రి పెను కలకలం రేగింది. గడచిన ఎన్నికల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప కంటే కూడా కర్నూలు జిల్లాలోనే ఆ పార్టీకి అత్యధిక సీట్లు దక్కాయి. జిల్లాలోని 14 ఎమ్మెల్యే సీట్లకు గాను 11 స్థానాలు, మొత్తం రెండు ఎంపీ సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుని సత్తా చాటింది. అయితే మొన్న సీఎం నారా చంద్రబాబునాయుడు జిల్లాలో జరిపిన పర్యటన ఆ పార్టీకి షాకిచ్చింది. వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ జిలానీలుగా మారనున్నారని, ఏ క్షణమైనా వారు సైకిలెక్కేయడం ఖాయమన్న వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై మీడియాలోను పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో నిన్న నేరుగా జగనే రంగంలోకి దిగారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్, పార్టీ మారే అవకాశముందని భావిస్తున్న ఎమ్మెల్యేలకు నిన్న సాయంత్రం నేరుగా తనే ఫోన్ చేశారట. గడచిన ఎన్నికల్లో పార్టీ వారికి ఇచ్చిన ప్రాధాన్యం, పార్టీ భవిష్యత్తును ప్రస్తావించిన జగన్, పార్టీ మారే యోచనను విరమించుకోవాలని సూటిగానే చెప్పినట్లు సమాచారం. ఇక తన నుంచి సహాయ సహకారాలు అందుకున్న ఎమ్మెల్యేలకు అదే విషయాన్ని చెబుతూ, పార్టీ మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నేరుగా జగనే తమకు ఫోన్ చేయడంతో పార్టీ మారదామని భావించిన ఎమ్మెల్యేలు తమ వైఖరి మార్చుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వెరసి ఆ పార్టీ కర్నూలు జిల్లా శాఖలో ప్రస్తుతం దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News