: జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ సమయం కుదింపుపై ఆర్డినెన్స్?
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ సరికొత్త మలుపులు తిరుగుతోంది. 31 రోజుల్లో గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నిపుణుల సలహాలు తీసుకుంటోంది. కేవలం 15 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలంటూ చేసిన చట్టసవరణ చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆర్డినెన్స్ జారీ చేస్తే ఎలా ఉంటుందన్న దిశగా తెలంగాణ ప్రభుత్వం నిపుణులు, మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీపై మంత్రులందరి సంతకాలు తీసుకుంది. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ లోని 3 లక్షల మంది సిబ్బందిలో మూడోవంతు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలు పంచుకోవాల్సి ఉంటుందని, ప్రక్రియ సుదీర్ఘ కాలం సాగితే పాలనకు అసౌకర్యం కలుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. దీంతో కేవలం 15 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని చట్ట సవరణ చేసినట్టు చెబుతోంది. దీనిపై ఆర్డినెన్స్ జారీ చేస్తే ఇక ప్రతిపక్షాలు, న్యాయస్థానంతో చిక్కులు ఎదురు కావని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నేటి రాత్రి లేదా రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం వుంది.