: రేపటి నుంచి ఏపీలో 'సంక్రాంతి' ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండగ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. రేపటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ ఎండి సాంబశివరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉందన్నారు. రాజధాని అమరావతిలో 215 ఎకరాల స్థలాన్ని ఆర్టీసీకి కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అమరావతిలో భారీ బస్సు స్టేషన్లు రెండింటిని నిర్మిస్తామన్నారు. పదమూడు జిల్లాల్లో విజయవాడ తరహా బస్టాండ్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి రూ.160 కోట్ల నష్టాన్ని తగ్గించామని, రోజు వారీ ఖర్చులను తగ్గించడం ద్వారా నష్టాలను అధిగమిస్తామని సాంబశివరావు పేర్కొన్నారు.