: అమెరికాలోని కాలిఫోర్నియాలో గ్యాస్ లీక్ తో ప్రజల ఇబ్బంది... ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించారు. లాస్ ఏంజిలెస్ లోని పోర్టర్ రాంచ్ ప్రాంతంలో ఉన్న సదరన్ కాలిఫోర్ని గ్యాస్ కంపెనీ అధీనంలో ఉన్న భూగర్భ గ్యాస్ స్టోరేజీ బావి నుంచి చాలా కాలంగా భారీ ఎత్తున గ్యాస్ లీకవుతోంది. దీని తీవ్రత ఇప్పుడు ఒక్కసారిగా పెరిగింది. దీంతో బెంబేలెత్తిన ప్రజలు ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన గవర్నర్ జెర్రీ బ్రౌన్ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించారు. ఆ భూగర్భ స్టోరేజీ నుంచి 1200 టన్నుల మీధేన్ తో పాటు ఇతర వాయువులు విడుదలవుతున్నాయని కాలిఫోర్నియా ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ లీకేజీ వల్ల స్థానిక ప్రజలు చాలామంది అస్వస్థులయ్యారని, ముక్కు, నోటి వెంట రక్తం కారిందని ప్రభుత్వం వెల్లడించింది. లాస్ ఏంజిలెస్ కౌంటీ, లాస్ ఏంజిలెస్ స్కూల్ బోర్డ్ ఇప్పటికే అత్యవసర పరిస్థితి విధించాయని, దీనిపై సమీక్షించిన అనంతరం రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించినట్టు గవర్నర్ తెలిపారు. ఎమర్జెన్సీ విధించిన కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇందు కోసం అయ్యే ప్రతి పైసా ప్రభుత్వమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.