: ప్రియాంక చోప్రాకు 'పీపుల్స్ చాయిస్ అవార్డు-2016'
బాలీవుడ్ అందాల నటి ప్రియాంక చోప్రా 'పీపుల్స్ చాయిస్ అవార్డ్-2016'కు ఎంపికైంది. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా నిర్వహించే కాంపిటీషన్ లో హాలీవుడ్ నటులు ఎమ్మా రోబర్ట్స్, లీ మిచెల్, మార్షియాగే హార్డన్ లాంటి స్టార్స్ ను వెనక్కి నెట్టి మరీ ప్రియాంక అవార్డు దక్కించుకుంది. హాలీవుడ్ టీవీ సిరీస్ 'క్వాంటికో'తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ... ఈ సిరీస్ లో నటనకే ఈ పురస్కారానికి ఎంపికైంది. ముఖ్యంగా అందులో లీడ్ రోల్ లో నటించిన పీసీని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పీసీ ట్విట్టర్ లో పేర్కొంది. లాస్ ఏంజిల్స్ లో నిర్వహిస్తున్న అవార్డు కార్యక్రమంలో ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ చేతుల మీదుగా అవార్డు అందుకుంది.