: తేనెటీగ ఎంత పని చేసింది...విమానాన్ని ఆపేసింది!
ఓ తేనెటీగ విమానాన్ని ఆపేసింది. వేలెడంత లేని తేనెటీగ విమాన సిబ్బందిని బెంబేలెత్తించింది. ఇండోనేషియాలోని గరుడ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం సుమత్రా దీవుల నుంచి జకార్తా వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులంతా ఎక్కిన తర్వాత పైలట్ విమానం స్టార్ట్ చేయగానే, అది మొరాయించింది. ఎంత గింజుకున్నా స్టార్ట్ కాలేదు. దీంతో వెంటనే పైలట్ ఇంజిన్ లో సమస్య ఉందని, స్టార్ట్ చేయగానే విమానం కదల్లేదని అధికారులకు సమాచారం అందించాడు. రంగ ప్రవేశం చేసిన అధికారులు ఇంజిన్ లోని ఓ ట్యూబ్ లో తేనెటీగ దూరినట్టు గుర్తించారు. దీంతో నాలుగు గంటలపాటు శ్రమించిన టెక్నీషియన్లు ఎలాగైతేనేం తేనెటీగను విజయవంతంగా బయటకు పంపించారు. అనంతరం విమానం ఎంచక్కా గాల్లోకి లేచింది. అయితే జరిగిన ఘటన వల్ల 156 మంది ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారని, వారికి గరుడ ఎయిర్ లైన్స్ సంస్థ నష్టపరిహారం చెల్లించింది.