: ఆంధ్రా ఎంసెట్ తేదీలో మార్పు ... మే5కు బదులుగా ఏప్రిల్ 29న ఎంట్రన్స్
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ నిర్వహణ తేదీలో మార్పులు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే5కు బదులుగా ఏప్రిల్ 29న ఎంసెట్ ను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసెట్ ఎంట్రన్స్ మే 5వ తేదీన నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించనున్న ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ లు కూడా మే మొదటి వారంలో జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ లు రాసే విద్యార్థుల సౌకర్యార్థం ఆంధ్రాలో ఎంసెట్ ను ముందుగా నిర్వహించడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సచివాలయంలో మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఉన్నత విద్యామండలి ఈరోజు సమావేశమైంది. మార్చి 18వ తేదీతో ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగుస్తాయని, ఎంసెట్ కు ప్రిపేర్ అవడానికి నెలరోజులకు పైగా సమయం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.