: ఈ ఏడాది 686 మందిని లేపేశాం: తాలిబాన్ సంచలన ప్రకటన
మతం ముసుగులో అమాయకుల ప్రాణాలను హరించడాన్ని ఘనకార్యంగా భావించే ప్రముఖ తీవ్రవాద సంస్థ తాలిబాన్, తాను గతేడాది చేసిన హత్యల వార్షిక నివేదికను విడుదల చేసింది. 2015లో మొత్తం 686 మందిని హత్య చేసినట్టు తెలిపింది. 2015 జనవరి 3 నుంచి డిసెంబర్ 26 వరకు తాను చేసిన ఘన కార్యాల గురించి అందులో వెల్లడించింది. పోలీసు, సైనిక స్థావరాలు, రాజకీయ నాయకులు, నగరాలపై నిర్వహించిన దాడుల వివరాలు వెల్లడించింది. వాటి ప్రకారం పాకిస్థాన్ కు చెందిన తెహ్రిక్-ఎ-తాలిబాన్ సంస్థ (టీపీటీ) 73 మంది వ్యక్తులపై దాడులు నిర్వహించింది. 12 అల్లర్లలో పాలు పంచుకుంది. 19 బాంబు పేలుళ్లు జరిపింది. ఐదు ఆత్మాహుతి దాడులు చేసింది. 17 మిస్సైల్ దాడులు చేసింది. ఆ దాడుల్లో కేవలం గత సెప్టెంబర్ లో పాకిస్థాన్ లోని పెషావర్ లోని బాదాబర్ ఎయిర్ బేస్ పై జరిపిన దాడిలోనే 247 మందిని ఖతం చేసినట్టు తెలిపింది. కాగా, ఈ దాడిలో కేవలం 29 మంది మాత్రమే మరణించారని పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలోని లెక్కలన్నీ తప్పుల తడకలని, తెహ్రిక్-ఎ-తాలిబన్ వాస్తవాలను వక్రీకరించిందని, అబద్ధాలు చెప్పిందని పలువురు పేర్కొంటున్నారు. తమది పెద్ద ఉగ్రవాద సంస్థ అని ప్రజలకు చెప్పేందుకు ఇలాంటి తప్పుడు మార్గాన్ని అవలంబిస్తోందని పాక్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.