: ప్రభుత్వ ఉద్యోగులకు ఊరింపే... ఇప్పట్లో జీతం పెరిగేది డౌటే!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెంచిన వేతనాలు ఇప్పట్లో లభించేలా లేవు. రెండు నెలల క్రితమే ఈ సిఫార్సులు కేంద్రానికి చేరగా, అప్పటి నుంచి దాదాపు 30 లక్షల మందికి పైగా ఉద్యోగులు తమ వేతనాలు పెరుగుతాయని ఆశగా ఉన్నారు. కానీ, జూన్ తరువాత మాత్రమే వేతనాల పెంపు అమలు తెరపైకి వస్తుందని సమాచారం. వేతనాల పెంపును ఎప్పటి నుంచి అమలు చేయాలన్న విషయమై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో నిర్ణయం వెలువడుతుందని అందరూ భావిస్తున్నప్పటికీ అది జరిగేలా కనిపించడం లేదు. ఈ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటంతో, ఆయా రాష్ట్రాలు వేతన సిఫార్సుల భారాన్ని తమపై వేయవద్దని, జీతాల పెంపును ఆలస్యం చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తరువాతే వేతన సంఘ సిఫార్సులు అమలయ్యే అవకాశాలు ఉన్నట్టు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.