: సహనాన్ని పరీక్షించొద్దు: కేజ్రీ సర్కారుకు సుప్రీం మొట్టికాయ


కేవలం ఓ నిర్ణయాన్ని తీసుకుంటేనే చాలదని, దాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలని ఢిల్లీలో అమలవుతున్న 'సరి-బేసి' విధానంపై సుప్రీంకోర్టు కేజ్రీవాల్ సర్కారును ఆక్షేపించింది. కార్ పూలింగ్ వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సరైన రవాణా వసతులు లేవని పలువురు ఢిల్లీ వాసులు సుప్రీంను ఆశ్రయించడంతో చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఆర్ భానుమతిలతో కూడిన బెంచ్ కేసును విచారించింది. "మీ నిబంధనకు ఢిల్లీ వాసులు సహకరిస్తున్నారు. వారు రద్దీతో నిండిన బస్సులు, మెట్రోల్లో ప్రయాణిస్తూ అవస్థలు పడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలి. వారి సహనాన్ని పరీక్షించవద్దు" అని బెంచ్ వ్యాఖ్యానించింది. అంతకుముందు అమికస్ క్యూరీ హరీష్ సాల్వే, న్యాయవాది అపరాజితా సింగ్ వాదనలు వినిపిస్తూ, 2001 నాటికి ఢిల్లీలో ప్రజా రవాణాకు 10 వేల బస్సులను సమకూర్చాలని 1998లోనే నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేస్తూ, ప్రస్తుతం 5 వేల బస్సులు మాత్రమే నడుస్తున్నాయని తెలిపారు. దీనిపై సీరియస్ అయిన న్యాయస్థానం, ప్రస్తుతం 4 నిమిషాలకు ఒక మెట్రో సర్వీస్ నడుస్తోందని, ఈ సమయాన్ని ఒకటిన్నర నిమిషానికి తగ్గించే ప్రయత్నం చేయాలని కేజ్రీవాల్ సర్కారుకు సూచించింది. "ఓ వ్యక్తి మీ నిర్ణయం కోసం తన సౌకర్యాన్ని వదిలి ప్రజా రవాణాను ఆశ్రయించి ఇబ్బందులు పడుతున్నాడు. ఇక అతని కారును ఇంటివద్దే ఉంచాలని మీరు ఎలా ఆదేశించగలరు? తక్షణం ప్రతి మెట్రోకు రెండు కోచ్ లను జోడించండి. ప్రజలు మెట్రోల్లో కూర్చుని సౌకర్యవంతంగా ప్రయాణిస్తేనే మీ నిర్ణయం సఫలమవుతుంది" అని వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News