: హైడ్రోజన్ బాంబు పరీక్ష విజయవంతమైంది!... ఉత్తర కొరియా ప్రకటన
ఉత్తర కొరియాలో నేటి ఉదయం సంభవించిన భూప్రకంపనలకు కారణం తెలిసిపోయింది. అది భూకంపం కాదని, అణ్వస్త్ర పరీక్షేనని ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించేసింది. తొలిసారిగా తాము తయారు చేసిన హైడ్రోజన్ బాంబు పరీక్ష విజయవంతమైందని ఆ దేశ అధికారిక చానెల్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకు తాము నిర్వహించిన తొలి హైడ్రోజన్ బాంబు పరీక్ష విజయవంతమైందని విస్పష్టంగా పేర్కొంది. ఈ పరీక్షతో ఉత్తర కొరియా తన అణ్వస్త్ర పాటవాన్ని మరింత పెంచుకున్నట్టయింది. ‘‘మా దేశ తొలి హైడ్రోజన్ బాంబు పరీక్ష 2016, జనవరి 6 (బుధవారం)న విజయవంతమైంది. అధికార వర్కర్స్ పార్టీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం మేరకే ఈ పరీక్ష దిగ్విజయంగా నిర్వహించాం’’ అని ఆ దేశ అధికారిక టీవీ చానెల్ న్యూస్ రీడర్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.