: రామజన్మభూమిపై చర్చించుకోండి: ఢిల్లీ యూనివర్శిటీ వివాదాస్పద నిర్ణయం
ఢిల్లీ యూనివర్శిటీలో రామ జన్మభూమిపై సదస్సును నిర్వహించుకునేందుకు వర్శిటీ అధికారులు ఆమోదం తెలపడం వివాదాస్పదమైంది. విశ్వహిందూ పరిషత్ అనుబంధ సంస్థ ఒకటి, ఈ సదస్సును నిర్వహించాలని తలపెట్టగా, అధికారులు కూడా అంగీకరించారు. క్యాంపస్ లో విద్యార్థుల మధ్య మతపరమైన విభేదాలు పెంచే ఈ తరహా చర్చలు తగవని అధ్యాపకులు, విద్యార్థులు విమర్శిస్తున్నారు. రెండు రోజుల పాటు 'శ్రీరామ్ జన్మభూమి టెంపుల్: ఎమర్జింగ్ సినారియో' పేరిట 9వ తేదీ నుంచి సదస్సును, వీహెచ్పీ నేత, దివంగత అశోక్ సింఘాల్ స్థాపించిన అరుంధతీ వశిష్ఠ అనుసంధాన పీఠ్ తలపెట్టింది. ప్రస్తుతం ఈ పీఠానికి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చైర్మన్ గా ఉన్నారు. సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేయాలని సంకల్పించారు. రాముని విలువలు, గుణగణాలు, భారత సంస్కృతిపై రామాయణ ప్రభావం, రాముని చరిత్రపై జరిగిన పరిశోధనల ఫలితాలు, రామమందిరంపై వివాదం, దాని భవిష్యత్తు తదితరాలపై సదస్సు జరగనుండగా, ఈ సదస్సు వద్దని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, వర్శిటీకి చెందిన విభాగాలు సదస్సును నిర్వహించడం లేదని, యూనివర్శిటీ ప్రాంగణంలోని వేదికను ఎవరైనా బుక్ చేసుకోవచ్చని అధికారులు చెబుతుండటం గమనార్హం.