: భారత కాన్సులేట్ పై ‘ఉగ్ర’ దాడిని తిప్పి కొట్టేందుకు... గన్ పట్టిన ఆఫ్ఘన్ గవర్నర్!
అటా మహ్మద్ నూర్... ఆఫ్ఘనిస్థాన్ లోని బాల్క్ రాష్ట్రానికి గవర్నర్. తన రాష్ట్ర రాజధాని మజారే షరీఫ్ లోని బారత రాయబార కార్యాలయంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారన్న సమాచారంతో ఆయన ఒక్కసారిగా తన కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు. నేరుగా ఇండియన్ కాన్సులేట్ వద్దకు వెళ్లారు. అప్పటికే ఎదురుగా ఉన్న భవనం నుంచి బాంబులు విసురుతున్న ఉగ్రవాదులను ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది నిలువరించారు. అదే సమయంలో ఆప్ఘన్ ప్రత్యేక బలగాలు కూడా ఐటీబీపీ బలగాలకు మద్దతుగా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు రంగంలోకి దిగాయి. భద్రతా బలగాల వద్దకు చేరుకున్న మహ్మద్ నూర్... సైనికులు పట్టే ఓ మెషీన్ గన్ ను తీసుకున్నారు. తన భుజంపై పెట్టుకుని ఉగ్రవాదుల పైకి గురి పెట్టారు. ఓ వైపు ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపిస్తూనే... మరోవైపు ఐటీబీపీ, ఆఫ్ఘన్ బలగాల్లో ధైర్యం నూరిపోస్తూ ఆయన ముందుకు సాగారు. ఇలా ఏ గంటో, అరగంటో ఆయన అక్కడ గడపలేదు. మొత్తం ఆపరేషన్ పూర్తయ్యే దాకా... ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం దాకా ఆయన అక్కడే ఉన్నారు. ఓ గవర్నర్ ఏమిటి? ఉగ్రవాదులపై పోరులో తుపాకీ పట్టడమేమిటనేగా మీ అనుమానం. ప్రస్తుతం గవర్నర్ హోదాలో పాలకుడిగా ఉన్న మహ్మద్ నూర్... గతంలో యుద్ధ వీరుడేనట. ముజాహిదీన్ సైన్యంలో ఆయన ఓ వీరుడిగా వెలుగొందారు. తదనంతర కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన నూర్... బాల్క్ రాష్ట్రానికి గవర్నర్ గా ఎంపికయ్యారు. నూర్ ధైర్య సాహసాలను కీర్తిస్తూ నిన్న భారత దౌత్య కార్యాలయం ఆయన భద్రతా బలగాల్లో ధైర్యం నింపిన తీరు, నేరుగా బరిలోకి దిగి, తుపాకీ చేతబట్టి ఉగ్రవాదులపై పోరాడిన ఫొటోలను, వివరాలను వెల్లడించింది.