: ఎయిర్ బేస్ లో పారికర్... కలకలం రేపిన గ్రనేడ్ పేలుడు


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ నాలుగు రోజులుగా తుపాకుల కాల్పులు, గ్రనేడ్ల పేలుళ్లతో దద్దరిల్లింది. ఎయిర్ బేస్ లోకి చొరబడ్డ మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఎట్టకేలకు మట్టుబెట్టేశాయి. దీంతో నిన్న ఉదయానికే దాదాపుగా కాల్పుల మోత ఆగిపోయింది. ఈ క్రమంలో ఎయిర్ బేస్ ను సందర్శించేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ నిన్న మధ్యాహ్నం తర్వాత పఠాన్ కోట్ వచ్చారు. అక్కడి భద్రతా సిబ్బంది, సైనికాధికారులతో భేటీ అయిన తర్వాత మరికాసేపట్లో దాడికి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఉన్నట్టుండి మరోమారు అక్కడ కలకలం రేగింది. దాడుల సందర్భంగా ఉగ్రవాదులు విసిరేసిన ఓ గ్రనేడ్... నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీ శబ్ధం వినిపించింది. కేంద్ర రక్షణ మంత్రి ఎయిర్ బేస్ లో ఉండగా, పేలుడు సంభవించడంతో భద్రతా దళాలు ఉరుకులు పరుగులు పెట్టాయి. అయితే నిర్వీర్యం చేస్తున్న సమయంలో గ్రనేడ్ పేలిందని తెలియడంతో భద్రతా దళాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆ తర్వాత పారికర్ మీడియాతో మాట్లాడేసి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News