: నా వాళ్లకు సీట్లివ్వకపోతే...నేను పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయను!: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
హైదరాబాదు బీజేపీలో ముసలం పుట్టేలా ఉంది. తన వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యవహార శైలి ద్వారా సంచలనం రేపే ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పాటుపడుతున్న వారిని కాదని, కొత్తవారికి సీట్లిస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆరుగురు అభ్యర్థుల పేర్లు ప్రతిపాదించానని, అయితే రాష్ట్ర నేత కిషన్ రెడ్డి తనను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తనను పార్టీ నుంచి బయటకు పంపాలనే లక్ష్యంతో వారికి సీట్లు నిరాకరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవ చేస్తున్న వారిపై రౌడీ షీట్లు ఉన్నాయని, అలాంటి వారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. పార్టీ వారికి సీట్లిచ్చేందుకు నిరాకరిస్తే, వారు ఏ పార్టీ తరఫున పోటీ చేసినా వారికే తాను ప్రచారం చేస్తానని, పార్టీ అభ్యర్థుల గురించి తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. లేదంటే తాను వేరే పార్టీలో చేరాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. టీడీపీతో బీజేపీకి అలయెన్స్ ఉన్నందువల్ల తనకు ఆ పార్టీలో మద్దతు లభించే అవకాశం లేదు కనుక, ఇతర పార్టీల్లో చేరే అవకాశం కొట్టిపారెయ్యలేనని ఆయన అభిప్రాయపడ్డారు.