: భారత్ తరపున వీరు రంగంలోకి దిగితే...ప్రత్యర్థి మటాష్!
తనను తాను రక్షించుకోవడం భారత్ కు బాగా తెలుసు. ఆపద వస్తే శత్రువును ఎలా ఎదుర్కోవాలో అంతకన్నా బాగా తెలుసు. ఈ విషయంలో అగ్రదేశాలకు ఉన్నట్టే భారత్ కు కూడా మెరికల్లాంటి యోధులున్నారు. సైగ చేసేంతలో సత్తా చాటి, శత్రువును మట్టికరపించి, వెనక్కి వచ్చే వేగం వారి సొంతం. అయితే కావాల్సిందల్లా ఆదేశాలే! ఇతర దేశాల యోధులకు... భారత యోధులకు ఉన్న ప్రధాన తేడా తీవ్రవాదులను ప్రాణాలతో పట్టుకునేందుకు ప్రయత్నించడం! స్నిఫర్స్ గా పిలిచే వీరు లక్ష్య సాధనలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకే సాగుతారు. ఈ నేపథ్యంలో భారత్ కు ఉన్న ప్రత్యేక దళాల గురించి ఓసారి తెలుసుకుందాం... * ఎన్ఎస్జీ కమెండోస్: 1984లో స్థాపించిన ఈ దళం సర్వకాల, సర్వావస్థలందు సిద్ధంగా ఉంటుంది. కేంద్ర దళాలలోను, సైన్యంలోను మెరుపు వేగంతో స్పందించే వారిని ఇందులోకి ఎంచుకుంటారు. వీరికి భయం అంటే తెలియదని ప్రతీతి. ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లు, హైజాకింగ్, బందీలను విడిపించడం, పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేయడం వీరి ప్రత్యేకతలు. వీరు క్షణాల్లో రంగంలోకి దిగి, వీలైనంత త్వరగా తమ టాస్క్ ముగిస్తారని చెప్పచ్చు. వీరినే బ్లాక్ క్యాట్ కమెండోస్ అని అంటారు. వీరు ధరించే డ్రెస్ వీరికీ ఆ పేరు తెచ్చిపెట్టింది. * మార్కోస్: అత్యంత అరుదుగా వినిపించే పేరు మార్కోస్. భారతీయ నావికాదళానికి చెందిన కమెండోస్. వీరిని మెరైన్ కమాండోస్ గా గతంలో పిలిచేవారు. భూ, జల మార్గాల్లో ఉగ్రదాడులను ఎదుర్కోవడంలో వీరికి వీరే సాటి. ముంబై దాడుల సమయంలో ముందుగా స్పదించింది వీరే. పూర్తి స్థాయి ఆయుధ సామగ్రితో పారా జంపింగ్ చేయగలగడం వీరి ప్రత్యేకత. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థితో పోరాడి, తలవంచేలా చేయడం వీరి ప్రత్యేకత. హెల్ వీక్, డెత్ క్రాల్ పేరిట నిర్వహించే ప్రత్యక్ష నరకంలా కనిపించే శిక్షణలో వీరు రాటుదేలుతారు. స్వదేశంలోనే కాదు, విదేశీ గడ్డపై దాడులు నిర్వహించడంలో కూడా వీరు సిద్ధహస్తులే. పరుగెత్తుతూ, పాకుతూ, అద్దంలో చూస్తూ కూడా ప్రత్యర్థిని గురితప్పకుండా కాల్చడంలో వీరి ప్రావీణ్యం అసమానం. * స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్: రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) కింద పనిచేసే ప్రత్యేక కోవర్టు పారామిలటరీ దళం ఇది. వీరు తమ నివేదికను నేరుగా క్యాబినెట్ కార్యదర్శికే అందిస్తారు. భారత్-చైనా యుద్ధం సందర్భంగా కోవర్టు ఆపరేషన్ కోసం ఈ దళాన్ని ఏర్పాటు చేశారు. అంతర్గత తిరుగుబాట్లపై ఈ దళాన్ని వినియోగిస్తారు. ఇందులో పని చేసే వారిని టిబెట్ స్వాతంత్ర్య పోరాట యోధుల నుంచి ఎంచుకున్నారు. ఉత్తరాఖండ్ లోని చక్రత కేంద్రంగా ఈ దళం పని చేస్తుంది. ఇది కేవలం 'రా'కు అనుబంధంగా మాత్రమే పని చేస్తుంది. *ఎస్పీజీ: మాజీ ప్రధానులకు భద్రత కల్పించేందుకు పార్లమెంటు చట్ట సవరణ ద్వారా దీనిని ఏర్పాటు చేశారు. వీరి వద్ద అస్సాల్ట్ రైఫిల్, గ్లాక్ పిస్తోల్ వంటి అత్యాధునిక ఆయుధ సామగ్రి ఉంటుంది. సెంట్రల్ ఫోర్స్, ఆర్పీఎఫ్ నుంచి అత్యుత్తమ సిబ్బందిని ఇందులో నియమిస్తారు. * గరుడ: గత వారం రోజులుగా అంతా వింటున్న పేరు గరుడ ఫోర్స్. భారత వైమానిక దళానికి చెందిన ఈ సిబ్బంది వాయు వేగంతో విరుచుకుపడడంలో నిష్ణాతులు. దీనిని 2004లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇందులో 2000 మంది పని చేస్తున్నారు. దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో వీరు సిద్ధహస్తులు. 72 వారాల కఠిన శిక్షణ అనంతరం వీరిని విధుల్లోకి తీసుకుంటారు. యూఎన్ తరపున కాంగోలో ప్రత్యేక విధులు నిర్వర్తించిన అనుభవం వీరి సొంతం. యూనిట్ ను వింగ్ కమాండర్ స్థాయి వ్యక్తి నియంత్రిస్తాడు. * ఫోర్స్ వన్: ఇజ్రాయిల్ కమాండో తరహా శిక్షణ పొందే యూనిట్ ఇది. 2009 ముంబై దాడుల తరువాత దీనిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఉగ్రదాడుల నుంచి ముంబైని రక్షించడమే దీని పని. ఇజ్రాయెల్ గూఢచారి సంస్థకు చెందిన మొస్సాద్ కమాండోస్ తరహాలో ఇది పని చేస్తుంది. దాడి జరిగిన 15 నిమిషాల లోపు స్పందించడం దీని ప్రత్యేకత. * పారా కమాండోస్: సర్వకాల సర్వావస్థల యందు సిద్ధంగా ఉండే పారా కమాండోస్ ఇండియన్ ఆర్మీకి చెందిన పారాచూట్ దళానికి చెందిన వారు. అసాధారణ యుద్ధ సమయంలో వీరు రంగప్రవేశం చేస్తారు. యుద్ధ సమయాల్లో బందీలను రక్షించడం, అంతర్గత తిరుగుబాట్లు నిరోధించడంలో వీరు సిద్ధహస్తులు, వివిధ రకాలైన ఆయుధాలు ప్రయోగించడంలో వీరు నేర్పరులు. భారత సైన్యంలో ఏడు రెజిమెంట్లు ఉన్నది వీరికే. ఒంటి మీద పచ్చబొట్టు పొడిపించుకునే అనుమతి ఉన్నది కేవలం వీరికే. ఇవే కాకుండా ఘాతక్ ఫోర్స్, కోబ్రాస్ వంటి ప్రత్యేక దళాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాయి. దాడి జరిగిందని తెలియగానే క్షణాల్లో స్పందించడం వీరి ప్రత్యేకత. ఇవి కాకుండా రాష్ట్రాల్లో కూడా కొన్ని దళాలు సిద్ధంగా ఉంటాయి.