: బాబు సమక్షంలో కంటతడి పెట్టిన వృద్ధుడు...ముఖ్యమంత్రి ఓదార్పు!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో ఒక వృద్ధుడు కంటతడి పెట్టాడు. ఆ వృద్ధుడికి చంద్రబాబు ధైర్యం చెప్పారు. కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలులో ఈరోజు జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు వృద్ధులకు పింఛన్ అందజేశారు. అది అందుకున్న రామనాథం అనే వృద్ధుడు బాబు ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తన బాధను బాబు ముందు వెళ్లగక్కాడు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని... అయితే, పిల్లలు తమని పట్టించుకోవటం లేదని, ఈ పింఛన్ డబ్బులు రాకపోతే తమకు బతుకు తెరువు కష్టమని వాపోయాడు. వృద్ధాప్యం కారణంగా తాను నడవలేకపోతున్నానని టీవీఎస్ ట్రై సైకిల్ ఇప్పించాలని చంద్రబాబుకు ఆయన విన్నవించుకున్నాడు. వెంటనే స్పందించిన చంద్రబాబు వృద్ధుడి కోరిక మేరకు టీవీఎస్ ట్రై సైకిల్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వృద్ధులెవ్వరూ ఇటువంటి బాధకు గురికాకూడదనే ఉద్దేశ్యంతోనే వారికి పింఛన్ లు అందిస్తున్నామని బాబు అన్నారు.

  • Loading...

More Telugu News