: జగన్ మంచి నాయకుడు...ఆయనకు నా దీవెనలు: సినీ దర్శకుడు దాసరి
జగన్ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ తో భేటీపై ఆయన స్పందించారు. వారిద్దరి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై జగన్ పోరాడుతున్నారంటూ ఆయన ప్రశంసించారు. జగన్ కు తన దీవెనలు, ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఇప్పటికే జగన్ మంచి నాయకుడిగా ఎదిగారని, భవిష్యత్ లో మరింత ఎదగాలని తాను కోరుకుంటున్నానని దాసరి అన్నారు. కాగా, దాసరి నివాసానికి జగన్ ఈరోజు వెళ్లారు. చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న దాసరిని వైఎస్సార్సీపీలోకి రావాలంటూ జగన్ ఆహ్వానించారు. అయితే, వైఎస్సార్సీపీ లోకి ఆయన చేరతారా? లేదా? అన్న విషయమై మీడియాతో దాసరి ప్రస్తావించలేదు. దాసరి నివాసానికి వెళ్లిన జగన్ కు ఘనస్వాగతం లభించింది. జగన్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి..శాలువా కప్పి దాసరి సన్మానించారు. కాగా, యూపీఏ హయాంలో బొగ్గు శాఖ మంత్రిగా దాసరి పనిచేశారు. బొగ్గు కుంభకోణంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.