: మార్చిలోపు రైతులు పంట కుంటలు తవ్వాలి: చంద్రబాబు
ఈ ఏడాది మార్చిలోపు రైతులు పంట కుంటలు తవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి పంటకూ నీరందించాలన్న ఆలోచనతోనే ఇలా కుంటలు తవ్వాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో నిర్వహించిన 'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెనుగంచిప్రోలును దత్తత తీసుకునేలా తిరుపతమ్మ ఆలయానికి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఇక్కడ అభివృద్ధి పనులకు రూ.18 కోట్లు అవసరమవుతాయని, ఆలయం నుంచి రూ.3 కోట్లు ఇప్పిస్తామని చెప్పారు. మిగతా డబ్బును ప్రభుత్వం విడుదల చేస్తుందని సీఎం తెలిపారు. పెనుగంచిప్రోలును పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని, ఇక్కడ కల్యాణ మండపం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రభుత్వం ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతం నిర్వహించారు.