: మా విద్యార్థులతో ఇబ్బందేంటి?: అమెరికన్ కాన్సులేట్ అధికారులతో కేటీఆర్
అమెరికాలో విద్యను అభ్యసించడానికి వెళ్లిన తెలుగు విద్యార్థులు అక్కడి హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారుల ఇమిగ్రేషన్ ఇంటరాగేషన్ లో విఫలమై, తిరిగి వస్తున్న వేళ, తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్, కాన్సులేట్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగు విద్యార్థులను తిప్పి పంపడానికి దారి తీసిన కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తెలుగు విద్యార్థులతో సమస్యలు ఎక్కడ వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వీసాలు జారీ చేసేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలని, లక్షల రూపాయల ఖర్చు చేసి అక్కడికి చేరిన తరువాత వెనక్కు పంపడం భావ్యం కాదని ఈ సందర్భంగా అమెరికన్ అధికారులకు కేటీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. సమస్యలు వాస్తవమేనని, అది తెలుగు విద్యార్థులకు మాత్రమే వచ్చిన సమస్య కాదని కాన్సులేట్ అధికారులు వివరించి, భవిష్యత్తులో ఇటువంటివి జరుగకుండా జాగ్రత్త పడతామని తెలిపినట్టు సమాచారం.