: కలుగుల్లోని ఎలుకల్లా ఐఎస్ తీవ్రవాదుల మకాం!
ప్రపంచం మొత్తం ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను మట్టుబెట్టేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. అయినా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు నిర్భీతిగా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే వీడియోలు విడుదల చేస్తూనే ఉన్నారు. నెలకో దేశంలో దాడులు జరుపుతామని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయితే వైమానిక దాడులు, భూతల పోరు జరుపుతున్నా సైనికులు మరణిస్తున్నారే తప్ప, ఐఎస్ అంతం కావడం లేదు. దీనికి కారణం ఏంటి? అనే అంశాలను ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరాతీశాయి. ఇందులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. ఇరాక్ లోని పలు కీలక పట్టణాలను స్వాధీనం చేసుకున్న ఐఎస్ తీవ్రవాదులు చమురు బావులను స్వాధీనం చేసుకుని, అమెరికా లాంటి దేశాలకు తక్కువ ధరకు దానిని అమ్ముతూ (రష్యా గతంలో పేర్కొంది) ఆదాయం సముపార్జించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఆదాయంతో అమెరికా, ఇతర ముస్లిం దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసుకుంటోంది. తాజాగా పలు దేశాలపై దాడులు చేసి వైమానిక సంపత్తి చేజిక్కించుకోవాలని భావిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇరాక్ లోని రమద పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఐఎస్ఐఎస్ గత ఏడాది కాలంగా తీవ్రప్రయత్నాలు చేస్తోంది. గిరిజనులకు పట్టున్న నగర శివార్లను స్వాధీనం చేసుకుని మకాం పెట్టిన ఐఎస్ ఉగ్రవాదులు భారీ ఎత్తున కందకాలు, గుహలు, సొరంగ మార్గాలు తవ్వుకున్నారు. భూతల పోరు అనగానే మూకుమ్మడిగా నేలపైకి రావడం, బాంబులు, తుపాకులు, రాకెట్ లాంఛర్లతో విరుచుకుపడడం... తమ వాసన పసిగట్టి విమానాలు వస్తున్నాయనగానే భూగర్భంలోకి వెళ్లి దాక్కోవడం చేస్తున్నారు. వీరి వ్యవహార శైలిని కలుగుల్లోని ఎలుకల్లా భావించవచ్చు. ఇక్కడ పది మీటర్ల లోతున్న భూగర్భ కందకాల్లో వందల సంఖ్యలో తీవ్రవాదులు దాక్కున్నారని, ఆ భూగర్భంలోనే సొరంగ మార్గం ఏర్పాటు చేసుకుని ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారుతుంటారని నిఘా వర్గాలు పసిగట్టాయి. వీరిని వ్యూహాత్మకంగా మట్టుబెట్టే ఆలోచనలు చేస్తున్నాయి. పొగబెట్టి ఎలుకలను ఊపిరాడనీయకుండా చంపేసే వెసులుబాటు ఉంది. మరి ఐఎస్ తీవ్రవాదులను ఏ పొగపెట్టి బయటకు రప్పించాలో నిఘా వర్గాలు ఆలోచించాల్సి ఉంది.