: మరాఠా పులికి...భారీ 'పులి' ప్రతిమను కానుకగా ఇవ్వనున్న బీజేపీ
మరాఠా పులి (శివసేన)కి బీజేపీ నేతలు భారీ ఫైబర్ పులిని బహుమతిగా అందజేయనున్నారు. గత కొంత కాలంగా శివసేన, బీజేపీ మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. బీజేపీ ఏం చేసినా శివసేన అడ్డుతగులుతోంది. విమర్శలు చేస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, మహారాష్ట్రలో పార్టీ పుట్టి ముంచుతుందని భావించిన బీజేపీ అధిష్ఠానం మరమ్మతులు చేపట్టేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా శివసేన పార్టీ గుర్తు అయిన పులి ఫైబర్ ప్రతిమను ఆ పార్టీకి బహుమతిగా అందజేయనుంది. ఈ ఫైబర్ పులి ప్రతిమ ఏడు అడుగుల ఎత్తు, 3.5 అడుగుల వెడల్పు, 55 కేజీల బరువు ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. వచ్చే వారం ఈ పులి బొమ్మను శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు అందజేయనున్నట్టు మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుధీర్ ముంగంటివార్ తెలిపారు. తమ రెండు పార్టీల మధ్యనున్న స్నేహ బంధం కారణంగానే ఈ బొమ్మను శివసేనకు అందజేస్తున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే జంతు ప్రేమికుడని, అదే సమయంలో తమ ప్రభుత్వం చేపట్టిన సేవ్ టైగర్ ప్రచారం కూడా కలిసి వస్తుందనే ఈ బొమ్మను ఆయనకు అందజేయనున్నామని ఆయన వెల్లడించారు.