: 2016 సోషల్ మీడియా సంచలనం మిచెల్... క్రికెట్ మ్యాచ్ చూస్తూ పుచ్చకాయ పనిబట్టిన ఆస్ట్రేలియా బాలుడు
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ లో మెల్ బోర్న్ స్టార్స్, మెల్ బోర్న్ రెనెగెడ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. క్రికెట్ మ్యాచ్ లో లీనమైపోయిన ఓ చిన్నారి బాలుడు తన చేతిలోని పెద్ద పుచ్చకాయను పూర్తిగా తినేశాడు. పూర్తిగా తినేశాడంటే, తొక్కతో సహా అని వేరే చెప్పక్కర్లేదేమో. తన పక్కనున్న వారిని ఏమాత్రం పట్టించుకోని ఆ బాలుడు కళ్లతో క్రికెట్ మ్యాచ్ ను చూస్తూ నోటితో పుచ్చకాయ పనిపట్టేశాడు. మ్యాచ్ ముగిసేలోగానే చేతిలోని పుచ్చకాయను మాయం చేసిన సదరు బాలుడి పేరు మిచెల్ స్కిబే. మిచెల్ ఫీట్ ను గమనించిన కామెంటేటర్లు... ‘‘క్రికెట్ కు కొత్త హీరో దొరికాడు. మొత్తం పుచ్చకాయను ఖతం చేసేశాడు. బాగా ఆడాడు’’ అంటూ కామెంట్లు విసిరారు. ఈ ఒక్క ఘటనతో మిచెల్ స్కిబే కాస్తా, ‘వాటర్ మెలన్ బాయి’గా మారిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎక్కిన ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. రోజుల వ్యవధిలోనే ఈ వీడియోకు వచ్చిన హిట్లు లక్ష దాటిపోయాయి. వెరసి మిచెల్ స్కిబే... 2016 సోషల్ మీడియా సంచలనంగా రికార్డులకెక్కనున్నాడు.