: పటాన్ చెరు ఎమ్మెల్యే సీటు ఖాళీనే!... స్పీకర్ నోటిఫై మాత్రమే మిగిలిందన్న భన్వర్ లాల్
హైదరాబాదు శివారు పారిశ్రామికవాడ, మెదక్ జిల్లాకు చెందిన పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరూ లేరట. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ విస్పష్టంగా ప్రకటించారు. పటాన్ చెరు ఎమ్మెల్యే సీటు ఖాళీగానే ఉందని కొద్దిసేపటి క్రితం ఆయన హైదరాబాదులో ప్రకటించారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన మహిపాల్ రెడ్డి ఓ కేసులో దోషిగా తేలి, రెండున్నరేళ్ల జైలు శిక్షకు గురయ్యారు. దీంతో సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావించిన భన్వర్ లాల్, మహిపాల్ రెడ్డి ఇక ఎంతమాత్రం ఎమ్మెల్యే కాదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేరని ఆయన పేర్కొన్నారు. అయితే సదరు నియోజకవర్గం ఖాళీగా ఉందని అసెంబ్లీ స్పీకర్ నోటిఫై చేయాల్సి మాత్రం మిగిలి ఉందన్నారు. అది కూడా లాంఛనమేనని భన్వర్ లాల్ పేర్కొన్నారు. మెదక్ జిల్లాలోని నారాయణ్ ఖేడ్ నియోజకవర్గానికి జరపనున్న ఉప ఎన్నికతో పాటే పటాన్ చెరు నియోజకవర్గానికి కూడా ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.