: ఐఎస్ తల నరుకుతా... చమురు తీసేస్తా!: తొలి ప్రచార వీడియోలో డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా అసలు సిసలు ప్రచారానికి దాదాపుగా రంగం సిద్ధమైంది. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న డోనాల్డ్ జాన్ ట్రంప్ ఇప్పటికే ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. తాజాగా ఆయన ప్రచారానికి సంబంధించిన తొలి వీడియో నిన్న విడుదలైంది. ఇందులోనూ ఆయన ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని లక్ష్యంగా చేసుకుని మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఎస్ ఉగ్రవాదుల తలలు నరికేస్తానని ఆయన ప్రకటించారు. అంతేకాక వారి అధీనంలోని చమురును స్వాధీనం చేసుకుంటానని సదరు వీడియోలో ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. వీడియో ప్రారంభంలోనే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి, తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ లను ప్రస్తావించిన ట్రంప్, ఇస్లామిక్ తీవ్రవాదం పట్ల వారు అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. అమెరికాలోకి ముస్లింలను ప్రవేశించరాదని గతంలో తాను ఇచ్చిన పిలుపును సమర్థించుకున్న ట్రంప్, ప్రస్తుత పాలకులు అవలంబిస్తున్న విధానాలను ఖండించారు. ఉగ్రవాదంపై అమెరికా అనుసరిస్తున్న మెతక వైఖరి కారణంగానే కాలిఫోర్నియాలో ఉగ్రవాద దాడి జరిగిందని కూడా ఆయన విరుచుకుపడ్డారు. అమెరికాను మరింత ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేయనున్నట్లు సదరు వీడియోలో ట్రంప్ ప్రకటించారు. తొలి వీడియోలోనే ఘాటైన వ్యాఖ్యలతో ఎంట్రీ ఇచ్చిన ట్రంప్, తదుపరి దశల ఎన్నికల ప్రచారంలో మరింత స్పీడుగా దూసుకెళ్లే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.